తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు, ఛాలెంజ్ లతో తనదైన మార్క్ పాలన సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కీలకమైనవి ఇప్పటికే అమలు చేస్తే ప్రజల మన్ననలు పొందారు. ఇక తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. కమిటీ వేసి కుదింపుపై నిర్ణయం తీసుకుంటామని సంచలనం రేపారు. ఈ క్రమంలో తాజాగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో రెండింటి పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ ను టీఎస్ నుంచి టీజీగా మార్చారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహం, లోగో కూడా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాలకు కొత్త పేర్లు కూడా పెట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్ లక్కీ నంబర్ 6 వచ్చేలా 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాట చేసిన జిల్లాలకు ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లు పెట్టారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ కు గోండు వీరుడు కుమురంభీం పేరు, భూపాలపల్లికి తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, కొత్తగూడెంకు భద్రాద్రి పుణ్యక్షేత్రం పేరు, గద్వాలకు శక్తిపీటం జోగులాంబ పేరు, భువనగిరికి యాదాద్రి పేరు, సిరిసిల్లకు వేములవాడ రాజన్న పేరు పెట్టారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో రెండు జిల్లాల పేర్లు మార్చాలని యోచిస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాకు మాజీ ప్రధాని, భారత రత్న పీవీ.నర్సింహారావు పేరు పెట్టాలని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈమేరకు గెజిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.