ఇటీవల కాలంలో వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు యూత్. పబ్, రీసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ ఫుల్ కొట్టి చిల్ అవుతున్నారు. కొంతమంది సీక్రెట్ ప్లేసుల్లో రెయిన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగితేలుతున్నారు. రేవ్ పార్టీలు జరుగుతున్న సమాచారం తెలుసుకుని పోలీసులు దాడులు చేయడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలాంటి పార్టీల్లో సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు కూడా దొరికిపోతున్నారు. రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్, మద్యం తీసుకుంటూ రెచ్చిపోతున్నారు.బర్త్ డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వహకులు ఒక్క రోజుకు రూ.30లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఏపీ,తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల దాడిలో కొకైన్, ఎన్డిఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాదాపు 15కార్లను సీజ్ చేశారు.
అయితే కార్లలో నెల్లూరు జిల్లాకు ప్రముఖ రాజకీయ నాయకుడు కాకాణి చెందిన కారును గుర్తించారు. ఘటనా స్థలంలో సదరు నాయకుడికి చెందిన పాస్‌పోర్ట్ లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి బెంగుళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. కారుపై స్టిక్కర్ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినలా డూప్లికేటా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు.
ఈ రేవ్ పార్టీకి వెళ్లిన వారిలో నటి హేమ కూడా ఉందని చెప్పడంతో… ఈ విషయంపై ఆమె స్పందించారు. బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్‌లో ఉన్నానని చెప్పారు. ఫేక్ న్యూస్ ను నమ్మోద్దని కోరారు. అయితే ఈ రేవ్ పార్టీలో ఓ బడా హిరో పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఐదురుగురి ఉన్నట్లు సమాచారం. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ జీఆర్ ఫామ్ హౌస్ అంటే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్. కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డి.. ఈయన ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది..? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి..? పుట్టినరోజును ఇంత గ్రాండ్ గా ఎందుకు ప్లాన్ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో వీవిఐపీలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానికిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.