ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైన తర్వాత అన్ని రాజకీయ పార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల కన్నా భారీగా జరిగిన పోలింగ్ తమకు అనుకూలమని వైసీపీ అంటే, ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శమని టీడీపీ కూటమి అంటుంది. అయితే రూరల్ ఓట్లు, మహిళలు, వృద్ధులు తమవైపే ఉన్నారని వైసీపీ ధీమాగా ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం 2024 ఎన్నికల్లో వైసీపీ దే విజయమని ధీమావ్యక్తం చేశారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాదిస్తుందని వైసీపీ నేత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు గెలవబోతోందని చెప్పారు. జూన్ 9న ఉదయం 9.30కి విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మే 13వ తేదీ జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే వైసీపీదే విజయమని తెలుస్తుందన్నారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు పెద్దసంఖ్యలో వచ్చి వైసీపీకి ఓటువేశారని చెప్పారు.
ఇక ఈ ఎన్నికలలో విజయం మాదే అంటూ టీడీపీ కూటమి కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 120 నుంచి 140 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓడిపోతామని తెలిసే వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారంటుూ విమర్శలు చేస్తున్నారు.భారీగా పోలింగ్ శాతం నమోదుకావటంతో పోలింగ్ సరళి ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ వంటి రాజకీయ వ్యూహకర్తలు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయమంటున్నారు. మరి ఏపీ ఓటర్లు తీర్పు తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకూ వేచిఉండాలి.