ఏపీ రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ ఒకరు. తండ్రి చంద్రబాబు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లో అడుగుపెట్టారు. ఒక పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ తయారు కావడానికి చాలా సమయం పట్టింది. మొదట్లో లోకేష్ పనితీరు, ఇప్పుడున్న పనితీరు బేరీజు వేసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొదట్లో లోకేష్ రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్, ప్రసంగాలు చూసినవారికి లోకేష్ కు రాజకీయాలు అవసరమా అనే అభిప్రాయాలు కలిగాయి. ముఖ్యంగా టిడిపి నేతల్లో లోకేష్ వ్యవహారం పై తీవ్ర చర్చనీయాంశం అయ్యేది. టిడిపిని వీడి బయటకు వెళ్ళిన వారు అనేకమంది లోకేష్ పని తీరుపై విమర్శలు చేసేవారు. దీనికి తగ్గట్లుగానే లోకేష్ వ్యవహారం ఉండేది. అయితే ఇప్పుడు చూస్తున్న లోకేష్ కు అప్పటి లోకేష్ కు పూర్తిగా సంబంధం లేదన్నట్లుగానే ఆయన వ్యవహారం ఉంది. ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేస్తూ, మాస్ లుక్ తో లోకేష్ కనిపించారు. పదునైన విమర్శలు చేస్తూ లోకేష్ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారారు అనే అభిప్రాయం ఇప్పుడు పార్టీ నాయకుల్లో కలుగుతుంది.
లోకేష్ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను హైలెట్ చేస్తూ, నిత్యం పార్టీ నాయకులతోనూ, ప్రజలతోనూ మమేకమమేకం అయ్యారు లోకేష్. గతంలో లోకేష్ ను వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలు సైతం ఇప్పుడు ఆయన వ్యవహారంలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. అందుకే టీడీపీ అద్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు సారధ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో బుద్దా వెంకన్న ఈ డిమాండ్ ను తాజాగా తెరమీదకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అద్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడిని కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయం. దాంతో ఈ అద్యక్ష పదవిని లోకేష్ కు అప్పగించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ కు మరోసారి మంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతోన్న వేళ అనూహ్యంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
2019లో పార్టీ అధికారం కోల్పోయాక ఐదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం లోకేష్ అవిశ్రాంతంగా పని చేస్తూ వచ్చారు. పాదయత్ర చేసి పరిణితి చెందిన నేతగా ప్రజల మన్ననలు పొందిన లోకేష్ అయితేనే పార్టీని మరింత పటిష్టం చేస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. పైగా పార్టీలో లోకేష్ మరింత పట్టు సాధించేందుకు, భవిష్యత్ లో పార్టీని నడిపేందుకు ఇప్పుడే ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. మరీ ఈ సారి కూటమి అధికారంలోకి వస్తే పార్టీతోపాటు ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి..