కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరోసారి చిరుతల సంచారం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం అలిపిరి నడక చివరి మెట్లపై రెండు చిరుతలు కనిపించడంతో నడకదారి భక్తులు ఆందోళన చెందారు. భయంతో పెద్దగా కేకలు వేశారు. భక్తుల అరుపులకు భయపడిన చిరుతలు అడవిలోకి పరుగులు తీశాయి. మెట్లపై చిరుతపులి కనిపించడంతో భక్తులు షాక్కు గురయ్యారు. దీనిపై వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో టీటీడీ అధికారులు వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో చిరుతపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు చిరుతల సంచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులు నడకదారి గుండా భక్తులను గుంపులు గుంపులుగా పంపుతూ… ఒంటరిగా వెళ్లవద్దని గుంపులుగా వెళ్లాలంటూ భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు.
మరోవైపు ఐదారు రోజుల కిందటే తిరుమల కొండ వద్ద చిరుతల సంచారం కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత పులిని వాహనదారులు గుర్తించారు. భక్తులు కారులో ప్రయాణిస్తుండగా, తెల్లవారుజామున చిరుతపులి వారు ప్రయాణిస్తున్న కారును అడ్డుకుంది. చిరుత రోడ్డు దాటి వెళ్లిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గంలో ఒకేసారి రెండు చిరుతలు కనిపించడం భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
గతేడాది అలిపిరి నడకమార్గంలోనే చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అటవీశాఖ ఉద్యోగులు చిరుతలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. వాటిని బోనుల్లో, నిఘా కెమెరాల్లో బంధించి సుదూర అడవుల్లో వదిలేశారు. అయితే ఇప్పుడు కూడా చిరుతల సంచారం భయానకంగా ఉంది. వేసవి సెలవుల్లో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది. ఎక్కువ మంది అలిపిరి నడకమార్గంలో నడిచి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో నడకమార్గంలో చిరుతలు కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.