టీ.కాంగ్రెస్ కొత్త టీపీసీసీ కోసం వేట మొదలెట్టింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా, సీఎం గా రెండు పదవుల్లో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికి సమర్థుడైన వ్యక్తిని అధిష్టానం అన్వేషిస్తోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అంచనాలకు మించి రేవంత్ రెడ్డి రాణించారు. దీంతో ఆయన స్థాయి వ్యక్తికే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది. తెలంగాణలో 2021లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వాగ్దాటి, సూటి విమర్శలు, ముక్కుసూటితనంగా మాట్లాడటం, చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టడం, ఎక్కడా తడబడకుండా అనర్ఘళంగా మాట్లాడటం వంటి వాటి ద్వారా రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. ఈ విషయాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధీటుగా నిలిచారు. కేసీఆర్ కు తాను మాత్రమే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవడంతోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతోపాటు తాజాగా పార్లమెంటు ఎన్నికలు కూడా ముగిశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ స్థానంలో కొత్త ఫైర్ బ్రాండ్ కోసం చూస్తోంది.
బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధాటికి కుదేలయిన తెలంగాణ కాంగ్రెస్ ను దాదాపు ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదే అనడంలో ఎవరికీ ఎలాంటి అతిశయోక్తులు అవసరం లేదు. ఈ నేపథ్యంలో అలాంటి సమర్థత ఉన్న నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ స్థానాన్ని సొంతం చేసుకుని పార్టీని ముందుండి నడిపించగల సమర్థులైన రేవంత్ రెడ్డి వంటి నాయకులు కనిపించడం లేదంటున్నారు.
కొంతలో కొంత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు కర్ణాటకలో డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని.. అలాగే తనకు కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరుతున్నట్టు చెబుతున్నారు. ఇంకోవైపు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయిన మధు యాష్కీ గౌడ్ కూడా పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు సమాచారం. ఆయన బీసీ కార్డును ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్, బీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా పీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేశారంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అంత సమర్థుడు మాత్రం ఇప్పటిదాకా అధిష్టానానికి లభించలేదని అంటున్నారు. అలాంటి నాయకుడు దొరికితే పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని చెబుతున్నారు.